ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. పట్టణ శివారు ఆర్ అండ్ బి రహదారిలో ఆదివారం ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. కిషోర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐ సిహెచ్. విద్యాసాగర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు హుండాయ్ ఐ టెన్ వాహనంలో 180 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు ముద్దాయిలను అదుపులోనికి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్తిపాడు సిఐ కే.కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి విలువ మూడు లక్షల అరవై వేల రూపాయలు కాగా కారు విలువ 5 లక్షలతో పాటు వారి వద్ద ఉన్న 30 వేలు నగదు కూడా స్వాధినము చేసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు. కాగా కార్లో ఉన్న గంజాయిని మండల సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అయిన తాసిల్దార్ ఏ.విశ్వనాథ్ శాస్త్రి ఆధ్వర్యంలో తూకం వేయగా 180 కేజీలు ఉన్నట్లు మధ్యవర్తులు రిపోర్టులో తెలిపారు. ముద్దాయిలైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పృధ్విరాజ్ త్రిపాఠి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమరిజిత్ మిశ్రాలను అరెస్టు చేసినట్లు ప్రత్తిపాడు సిఐ కె కిషోర్ బాబు తెలిపారు. కాగా ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం లోని మల్కన్ గిరి ప్రాంతం నుండి దారకొండ మీదుగా పలకజీడి ఏజెన్సీ ప్రాంతము చేరుకొని అక్కడి నుండి హుండాయ్ ఐ 10 కారులో అడ్డతీగల మీదుగా ఏలేశ్వరం మండలం ఎర్రవరం హైవే చేరుకొని అక్కడ నుంచి తిరిగి ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ కు తరలిస్తున్నట్లు పోలీసులు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఈ గంజాయిని అమ్మిన దారకొండ గ్రామానికి చెందిన నారాయణరావు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేయవలసి ఉందని పోలీసులు ఆదివారం రాత్రి ఆ ప్రకటనలో వివరించారు.
భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం.
RELATED ARTICLES