
ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కొలువై ఉన్న శ్రీ బాపనమ్మతల్లి అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం బుధవారం ఉదయం వైభవంగా నిర్వహించారు . వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 600 మంది మహిళలు.. గోదావరి నది జలాలతో స్వయంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. ముందుగా ఆలయం వద్ద నుంచి భారీగా అనపర్తి నల్లకాలువ వద్దకు చేరుకున్నారు. కాలువలోని నదీ జలాలను సేకరించిన కలశాలను శిరస్సును ధరించి మంగళ వాయిద్యాలు , బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి చిత్రపటంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.అనంతరం కలశాల్లో హరిద్రాన్ని కలిపి వారే స్వయంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. ఏప్రిల్ 6 7 8 తేదీల్లో జరగనున్న అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి ప్రత్యేక పూజలు చేసి హరిద్రాభిషేకం చేశారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు బాసిల్లుతున్నారు. హరిద్రాభిషేకంలో పాల్గొన్న వారికి కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ఆలయ కమిటీ సభ్యులు తాంబూళం , ప్రసాదం అందజేశారు.



