
మెట్టజ్యోతి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కాకినాడ డివిజన్ కమిటీ సమావేశం పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన వక్తలుగా ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి. రమేష్ లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెదపూడి మండలంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాల్లో జనావాసాలకి దగ్గరలో ఉన్న ఉప్పునీటి రొయ్యల చెరువుల సాగు వలన మంచినీటి బావులు, చేతిపంపులలో నీరు కలుషితం అయిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. త్రాగునీరు కొనుక్కుని తాగే పరిస్థితి దాపురించిందన్నారు. భూగర్భ జలాల కాలుష్యానికి కారణం అవుతున్న ఉప్పునీటి రొయ్యలు చెరువులను తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాకినాడ డివిజన్లోని ప్రజా సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్రకటిత విద్యుత్ కోతలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం లోని సమస్యలు, కౌలు రైతుల సమస్యలు వంటి ప్రజా సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో తిరిగి, ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్మించి పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు ఏల్లే సత్తిబాబు, వడ్లమూరి మంగాదేవి, వల్లూరి సత్తిబాబు, గుండుపల్లి శ్రీ రంగమూర్తి తదితరులు పాల్గొన్నారు.



