మెట్టజ్యోతి : ఏలేశ్వరం: ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో కలపడం తగదని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కందుల క్రాంతి, చందక దుర్గాప్రసాదులు అన్నారు. విలీనం వలన 3,4,5 తరగతుల విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 354 ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో కలపడానికి ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు పథకం కింద కోట్లాది రూపాయలు వెచ్చించి అదనపు తరగతి గదులు, వంటశాలలు, ప్రహరీలు ఎందుకు నిర్మించారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీలైనంత ప్రక్రియను విరమించుకుని 3,4,5 తరగతుల విద్యార్థులు తమ నివాసాలకు సమీపంలోని విద్యనభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.