ఆంధ్రన్యూస్ : పి గన్నవరం. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. ధవలేశ్వరం నుంచి వరద నీటిని దిగువకు వదులుతుండడంతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద ఉధృతికి మరోసారి లంక గ్రామాలు బిక్కచిక్కాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంక ఎదురుబిడియం కాజ్ వే పైకి వరద నీరు చేరడంతో అయినవిల్లి లంక , వీరవల్లి పాలెం , పల్లపులంక , అద్దంకివారిలంక నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సీజన్లో మూడవసారి వరదలు రావడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఉధృతితో కోనసీమ ప్రాంతంలోని నదీపాయలో ప్రవాహ ఒరవడి పెరిగింది. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలడంతో గౌతమి , వశిష్ట , వైనతేయ , వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు మరోసారి వరద నీటిలో చిక్కుకున్నాయి. అల్ప పీడనం ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో జోరుగా వరుసలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరిపి లేని వర్షాలు , ముంచుకొచ్చిన గోదావరి వరద కలిసి కోనసీమ లంక గ్రామాల ప్రజల కష్టాలను రెట్టింపు చేశాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. అయినవిల్లి మండల పరిధిలోని నాలుగు లంక గ్రామాల ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎదురుబిడియం కాజ్ వే వద్ద నాటు పడవలు మీద లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల్లో కాయలు వరదకు కొట్టుకుపోకుండా రైతులు ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతున్నప్పటికీ దిగువ ప్రాంతంలో మాత్రం మరో రెండు రోజులపాటు వరద ఉధృతి కొనసాగుతోంది.
REPORTER : MURALI