ఆంధ్రన్యూస్ : రౌతులపూడి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా మనబడి- నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన, ఆధునికీకరణ, అదనపు తరగతులు నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరు కృతికా శుక్లా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రౌతులపూడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, విద్యార్థినిలతో మాట్లాడి పాఠశాలలో భోజనం, విద్యా బోధన, విద్యా కానుక, పాఠ్య పుస్తకాలు పంపిణీ వివరాలు ఆరా తీశారు. పాఠశాలలో మనబడి నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పారిశుధ్యం, మరుగుదొడ్లు నిర్వహణ ఇతర పరిసరాలు అశుభ్రంగా ఉండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టరు ఆదేశించారు. విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కింద అందించే ఆహారం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరిస్తూ నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు శంఖవరం, పెద్ద మల్లాపురం పిహెచ్సి పరిధిలో ఉన్న రాఘవపట్నం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టరు.. జిల్లా వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్ అధికారులు కలిసి పరిశీలించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అంగన్వాడి చిన్నారులకు కలెక్టరు చేతుల మీదుగా నులిపురుగు మాత్రలు వేశారు. అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు, బోధన వివరాలను అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎటువంటి రక్తహీనత లోపం లేకుండా సకాలంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు.
అనంతరం రాఘవపట్టణం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను, వసతి గృహాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. స్థానిక ప్రజల నుంచి కలెక్టరు వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి జిల్లా కలెక్టరు కృతికా శుక్లా రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్త్రీ, పురుష వార్డు, ఇన్ పేషెంట్, ఆరోగ్యశ్రీ సేవలు తదితర వివరాలను ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వైద్య సేవలను నిమిత్తం వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా వైద్య అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయాలని జిల్లా కలెక్టరు కృతికా శుక్లా తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట రౌతులపూడి మండలం ఎంపీపీ గంటిమళ్ళ రాజ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు గొల్లు లక్ష్మణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర, ఇంచార్జ్ డీఎం అండ్ హెచ్ఓ డా. ఆర్. రమేష్, ఆర్బీఎస్కె కోఆర్డినేటర్ ఐ.ప్రభాకర్, డీసీహెచ్ఎస్ డా.పీబి. విష్ణువర్ధని, ఏపీ డబ్ల్యూఐడిసి ఈఈ కె. లక్ష్మణ రెడ్డి,ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు, పెద్దాపురం డివిజన్ ఆర్డీవో జే. సీతారామరావు, డీటిడబ్ల్యూఓ ఎ.విజయశాంతి, డీఎల్డీవో కెఎన్.వి. ప్రసాదు రావు, తహసీల్దార్ ఎల్.శివబాబు తదితరులు పాల్గొన్నారు.