ఆంధ్రన్యూస్ : విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సాంస్కృతిక, సామాజికవేత్త డా.గణగళ్ళ విజయ్ కుమార్ కు ప్రసిద్ధి చెందిన ” విశిష్ట సేవారత్న ” అవార్డుకు ఎంపిక అయ్యారని హర్యానా రాష్ట్రానికి చెందిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ చైర్మన్ డాక్టర్ సి.పి యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈనెల 16న ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ తమన్ బహలాల్ మరియు భారత సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది డా. సునీల్ కుమార్ మిశ్రా చేతులు మీదుగా విజయ్ కుమార్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. డా.గణగళ్ళ విజయ్ కుమార్ అర్పిత సాంస్కృతిక, సేవా సంస్థ ద్వారా దేశంలోని అనేక రాష్ట్రాలలో సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈయన రచించిన “ది వైజాగ్ టూరిస్ట్ గైడ్” పుస్తకాన్ని 1999 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి విశాఖ జిల్లా చరిత్రను గ్రంథస్థం చేసిన ఘనుడు విజయ్ కుమార్ అని అభినందించారు. ఈయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మితమైన “ది వైజాగ్” డాక్యుమెంటరీ చిత్రాన్ని 2005 సంవత్సరంలో నాటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండే హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఆవిష్కరించగా, ఆనాటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చే విజయ్ కుమార్ అభినందనలు అందుకున్నారు, ఇదే చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం చే అవార్డు కూడా స్వీకరించారు. ఈయన దర్శకత్వం వహించిన అనేక టెలిఫిలిమ్స్ లో విశాఖ కళాకారులకు అవకాశాలు కల్పించారు. దేశవ్యాప్తంగా కళ, సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు బడ్డ విజయ్ కుమార్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నారని మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ చైర్మన్ డాక్టర్ సి పి యాదవ్ పేర్కొన్నారు. డా.గణగళ్ళ కు అవార్డు రావడం పట్ల అధికారులు, సాంస్కృతిక, సేవా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.