
ఆంధ్రన్యూస్ : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం(Center) అప్రమత్తమవుతోంది. మరోవైపు ఇన్‌ఫ్లుయెంజా(influenza) వ్యాప్తి కలవరపెడుతోంది.
ఈ క్రమంలో ఎలాంటి అత్యవసరపరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించేందుకు నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. వైద్య సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల లభ్యతను అంచనా వేసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఈ డ్రిల్స్‌లో పాల్గొనాలని పేర్కొన్నాయి. ఈ మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలు మార్చి 27న జరిగే వర్చువల్ సమావేశం ద్వారా రాష్ట్రాలకు వివరించనున్నట్లు తెలిపాయి.
కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో క్రియాశీలక కేసులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ వల్ల ఆసుపత్రిలో చేరికలు, మరణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో కేసులు పెరుగుదలను అరికట్టేందుకు అప్రమత్తతతో ఉండటం అవసరమన్నారు. ఈ కొవిడ్,ఇన్‌ఫ్లుయెంజా దాదాపు ఒకే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.
రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యల ద్వారా వీటి వ్యాప్తిని నిరోధించవచ్చని చెప్పారు.



