

ఎమ్మిగనూరు: ఆంధ్ర న్యూస్: కార్పొరేట్లకు ఊడిగం చేసి ప్రజలపై భారము మోపే పాలక పార్టీలకు గోరి కట్టాలి !తెలుగుదేశం వైయస్సార్ జనసేన పార్టీలు బిజెపి రిమోట్ కంట్రోల్ ! కార్పొరేట్లకు ఊడిగం చేసి ప్రజలపై భారాలను మోపే కేంద్రంలోని పాలక పార్టీ అయిన బిజెపికి, రాష్ట్రంలోని అధికార కూటమికి ప్రజలు గోరి కట్టే సమయం ఆసన్నమైం దని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎంఏ గఫూర్ పేర్కొన్నారు. ఆదివారం సిపిఎం పార్టీ 23వ జిల్లా మహాసభలు పురస్కరించుకొని కొత్త మున్సిపల్ కార్యాలయం ఆవరణ నుండి పోస్ట్ ఆఫీస్, కూరగాయల మార్కెట్, శ్రీనివాస టాకీస్ సర్కిల్, సోమేశ్వర్ టాకీస్ సర్కిల్, శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం బంగారు దుకాణాల సముదాయం బజార్, అంబేద్కర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ మీదుగా తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో బహిరంగ సభ వరకు ర్యాలీ నిర్వహించబడింది. ఐద్వా కార్యకర్తలు కోలాటాలు వేస్తూ ర్యాలీ ముందు నడిచారు. అలాగే డప్పు కళాకారులు డప్పు నృత్యం వేస్తూ ర్యాలీ ముందు సాగారు. సభా వేదికపై ప్రజానాట్యమండలి కళాకారులు ప్రజలను చైతన్య పరుస్తూ నృత్యాలు గేయాలు ఆలపించారు ఇవి ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం బహిరంగ సభ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించబడింది. ముఖ్యఅతిథిగా కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎంఏ గఫూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడంలో తెలుగుదేశం వైఎస్ఆర్ జనసేన పార్టీలు మేమంటే మేము ముందున్నామంటూ ఊడిగం చేస్తున్నాయన్నారు. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా ముందు ఊడిగం చేస్తున్నారన్నారు. భారతదేశం సెక్యులర్ దేశమని, దానికి ప్రమాదo వచ్చిందన్నారు. బిజెపి మొత్తం మతోన్మాదంతోనే అధికారంలోకి వచ్చింది అన్నారు.2014 ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో లక్షల డబ్బు వేస్తానని, నేడు జిఎస్టి పేరుతో, ఇతర పన్నుల పేర్లతో వేలాది కోట్ల డబ్బు ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. సంపన్నులైన ఆదానీ,అంబానీ లకు పనులు రాయితీ ఇస్తున్నారని, దేశంలో కర్షకులకు కార్మికులకు రాయితీలు ఇవ్వకుండా భారాలు మోపుతున్నారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం పార్టీ రైతులు కష్టజీవుల పార్టీ అని, భవిష్యత్తు ఎర్రజెండా పార్టీలదే అన్నారు. ఆదానీ అంబానీలకు ఈ దేశ పాలకులు కరెంటు గ్యాస్ నౌకాశ్రయాలు బ్యాంకులు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్పారని, ఇప్పుడు ఆదానీ అంబానీలకు గ్రామీణ ప్రాంత సంతల పై కూడా కన్నుబడిందని, మరో 20 ఏళ్ల నాటికి ఎమ్మిగనూరు సంత మార్కెట్ను కూడా ఆదా నీ అంబానీలు చేజిక్కించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఐతున్నప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావడంలోనూ, ప్రాజెక్టులు నిర్మించడంలోనూ గోరంగా విఫలం చెందారన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని పది ఎకరాల భూస్వాములు సైతం వలస వెళ్లే పరిస్థితి నెలకొంది అన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు. నిన్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది అన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోని పాలకులు రైతుల ప్రయోజనాలు గాలికి వదిలేయడంతోనే ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయన్నారు. ఢిల్లీలో రైతుల సమస్యలపై పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం లాఠీలతో కొట్టి, తప్పుడు కేసులు బనాయిం చిందన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఈ రెండు రోజుల మహాసభల్లో రైతులు కార్మికులు మహిళలు ఉద్యోగస్తులు ఎదుర్కొనే సమస్యలపై తీర్మానాలు చేసి పోరాడుతామన్నారు. జిల్లాలో రైతుల భూములు ప్రాజెక్టు పేరుతో తీసుకున్న భూములకు నష్టపరిహారం అందేంతవరకు పోరాడిన ఘనత సిపిఎం దే అని అన్నారు. ప్రజలకు హానికరంగా ఉండే దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వద్ద ఉన్న యురేనియం తవ్వకాలను వ్యతిరేకించి, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ప్రకటన ఇప్పించే వరకు పోరాడిన ఘనత కూడా సిపిఎం దే అన్నారు. ఎమ్మిగనూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేయాలని, అలాగే చేనేతలను ఆదుకోవడానికి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని, సాగునీటి వనరులను పెంపొందింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నిర్మల, రాష్ట్ర కమిటీ సభ్యులు రామన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ రామకృష్ణ నారాయణ వెంకటేశ్వర్లు హనుమంతు గోవిందు అంజిబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



