కాకినాడ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, గుడువులోపు పరిష్కారించాలని జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లాస్థాయి ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో కె.శ్రీధర్ రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీఎస్ సునీతలతో కలిసి ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో 336 అర్జీలు స్వీకరించారు. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్ తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఒకే అంశంపై దరఖాస్తులు మళ్లీమళ్లీ రాకుండా స్పష్టమైన సమాచారంతో అర్జీలను గడువులోపు పరిష్కరించాలని కలెక్టరు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.