ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశం
మెట్టజ్యోతి( జంగారెడ్డిగూడెం) ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలలో ఇంకా పూర్తి కానీ కాలనీలు డిసెంబర్ నెలాఖరుకు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేసి, నిర్వాసితులకు కొత్త గృహాలకు తరలించాల్సిందేనని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో శనివారం జాయింట్ కలెక్టర్, ఐ టి డి ఏ ఇంచార్జి ప్రాజెక్ట్ అధికారితో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పనులను అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ 41. 15 కాంటూర్ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నిర్వాసితులకు హామీ ఇచ్చారని, ఆ మేరకు పనులు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వేలేరుపాడు, రేపాకగొమ్ము నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కాలనీలు పూర్తి అయ్యాయని, వారిని త్వరితగతిన కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల కోసం తాడువాయి లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన కొనసాగడంపై సంబంధిత కాంట్రాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాడువాయి కాలనీలో ఇంకా ప్రారంభంకాని ఇళ్ల నిర్మాణ పనులను నూరు శాతం వెంటనే ప్రారంభించి , డిసెంబర్ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణపనులు పూర్తి చేసి, నిర్వాసితులు నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులలో జాప్యం చేసే కాంట్రాక్టర్ల టెండర్ గడువును పొడిగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఇసుక, సిమెంట్ సరఫరాలో ఎటువంటి కొరతా లేకుండా చూడాలని, కాంట్రాక్టర్లకు అందించిన ఇసుక వే బిల్స్ ను ఎప్పటికప్పడు రికన్సిలియేషన్ చేసుకోవాలన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ మరియు ఐ టి డి ఏ ఇంచార్జి ప్రాజెక్ట్ అధికారి పి . అరుణ్ బాబు , జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె. ఝాన్సీరాణి, గృహనిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ .నరసింహారావు, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ రమాదేవి, సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, తహసీల్దార్లు చల్లన్న దొర , భద్రయ్య, సుమతి, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు నాగరాజు, మోహన్, తదితరులు పాల్గొన్నారు